Fights యుద్దం
పంచభూతాల్ని ఆధారం చేసుకుని సాధన చేసే భారతీయ యుద్ధ కళలు బాహ్య, అంతర్గత శక్తులపై ప్రభావం చూపి సూపర్ హ్యూమన్‌ల స్థాయికి కళాకారులను చేరుస్తాయి. కుంగ్ ఫూ, కరాటే వంటి ఆసియా యుద్ధ కళల్లో మిళితమైన దక్షిణాసియా మూల యుద్ధ కళగా పేరొందిన అతి ప్రాచీన కలరిపాయట్టు దక్షిణ భారతావనిదే. చైనాలో పుటి డామో, వియత్నాంలో బోది డట్‌మా, జపాన్‌లో బొదై దరుమా, కొరియాలో పోరి దల్మాగా కొలుస్తున్న షావోలిన్ ఆత్మరక్షణ విద్య ఆద్యుడు బోధి ధర్ముడు దక్షిణ భారతీయుడే. ప్రపంచంలోనే అతి పురాతనమై మార్షల్ ఆర్ట్‌గా డాక్యుమెంట్ కాబడిన మల్లయుద్ధం మనదే. ఎన్నో దాడులను తట్టుకుని నిలబడిన భారతీయ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నిరాదరణ అనే స్వదేశీయుల మౌన యుద్ధంలో కనుమరుగు కాబోతున్నాయి.
ఆధునిక మార్షల్ ఆర్ట్స్‌కు క్రేజ్ తెచ్చిన బ్రూస్ లీ సైతం అభిమానించే మల్లయోధుడు గామా భారత ఖండానికి చెందినవాడే. ఇంగ్లండ్ సామ్రాజ్యమే గౌరవించిన ఓటమినెరుగని మరో మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు యోధుడే. ఇండో-ఆర్యన్ వలసలకు ముందే వేళ్లూనుకున్న మల్ల యుద్ధ కళకు ఎన్నో ఆధారాలు లభించాయి. వేల ఏళ్ల క్రితం నుంచి నేటి ఆధునిక యుద్ధకళల్లో భారత ముద్ర ప్రత్యేకం. ప్రాచీన గ్రంథాలైన వేదాలు, పురాణాల్లోను వీటిని సవివరంగా వివరించారు. మార్షల్ ఆర్ట్స్ ఉనికికి సంబంధించి రాతపూర్వకంగా ఉన్న ఆధారం ప్రాచీన సంగం రచనల్లో కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్దం వరకు గ్రంథస్తమైన సంగం సాహిత్యంలోని ఆకనానురు, పురానానురుల్లో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావనే కాదు ఆయుధాలు, పద్ధతుల గురించి విపులమైన చర్చే ఉంది. ఆసియా యుద్ధ కళలకు తల్లివేరుగా, అతి ప్రాచీనమైనదిగా చెప్పుకుంటున్న కళరిపాయట్టుకు ఇవే బీజ కళలు. సంగం సాహిత్యంలోనే 'శిలప్పాదికారమ్' అనేది శిలంబం యుద్ధ కళ ప్రాధాన్యతను వివరిస్తుంది. విదేశీ యాత్రికులను రప్పించిన దీని విన్యాసాలను పొగుడుతూ వారి ప్రాచీన యాత్రా గ్రంథాలున్నాయి. పురాతత్వ కళాఖండాలు, ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు, గుహాలయాలు, యుద్ధ స్మారకాల్లో ప్రాచీన భారత యుద్ధ కళలకు సంబంధించిన శిలా విన్యాసాలు అనేకం కనిపిస్తాయి.
పరాక్రమానికి సాక్ష్యాలెన్నో...
హర్ష చక్రవర్తి కాలంలో యాత్ర సాగించిన చైనా సన్యాసి యువాన్‌జాంగ్ గ్రంథస్తం చేసిన ఓ ఘటన యుద్ధ కళల ఉనికి ఏపాటిదో వివరిస్తుంది. హత్యాయత్నాన్ని నిలవరించి ఆగంతకుడిని హర్షుడు చాకచక్యంగా ప్రాణాలతో పట్టుకున్న ఆ ఘటనలో ఆయన కదిలిన వేగం, మెరుపులాంటి స్పందన గురించి యువాన్‌జాంగ్ ప్రస్తావించాడు.
ఇండో-ఆర్యన్‌ల వలసలకు పూర్వమే నాలుగు రూపాల్లో మల్ల యుద్ధాన్ని క్రోడీకరించారు. మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన వివరాలు ధనుర్వేద సంహిత, అగ్ని పురాణం, అర్థశాస్త్రం, సారంగధర పద్ధతి, నీతి వాక్యామృత, భోజుని యుక్తికల్పతరు, సోమేశ్వర-3 మానసోల్లాస వంటి శాస్త్ర గ్రంథాలతోపాటు బౌద్ధ, సిక్కు, జైన గ్రంథాల్లోను కనిపిస్తాయి.
నేటి భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్‌లలో విస్తరించిన యుద్ధకళలన్నింటినీ భారత యుద్ధ కళలుగానే ప్రస్తావిస్తారు. గట్కా, హుయెన్ లాంగ్లాన్, కళరిపాయట్టు, మర్దానీ ఖేల్, శిలంబం, స్క్యే, ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం, పెహల్వానీ, వజ్ర ముష్టి, వర్మ కళ, వంటి ప్రధాన స్రవంతి విద్యలు నేటికీ మనుగడ సాగించగలుగుతున్నాయి. యుద్ధ కళలులానే కాక నృత్య రూపకాలుగా అవి రూపాంతరం చెందాయి. కథాకళి సూక్ష్మ కదలికల మెరుగుదలకు కళరిపాయట్టును కళాకారులు నేర్చుకుంటారు. ఈశాన్య రాష్ట్రాల చ్ఛౌ అనే నృత్య రూపకం కేవలం మార్షల్ ఆర్ట్స్ కళాకారులు మాత్రమే చేయగలరు. మార్షల్ ఆర్ట్స్ అనేవి కేవలం క్షత్రియులకే పరిమితం కాదని మిగతా వర్గాలు కూడా విస్తృతంగా సాధన చేశాయని ఉద్యోదనసూరి కువలైమాల గ్రంథం ఆధారంగా నిలుస్తోంది. 8వ శతాబ్దికి చెందిన ఈ గ్రంథంలో ఉపఖండవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్‌ను అనేక వర్గాల విద్యార్థులకు నేర్పించినట్టు వివరించారు. అయితే బౌద్ధం విస్తరించిన భారత్‌లో శాంతికాముకత పరిఢవిల్లి క్రమంగా యుద్ధ కళల్ని నిరుత్సాహపరిచేందుకు కృషి జరిగిందని చరిత్రకారులు అంటారు. కంధకుని కాలంలో ముష్టియుద్ధం, మల్ల యుద్ధం, ధనుర్విద్య, కత్తిసాములు నిషేధించినట్టు తెలుస్తుంది.
దక్షిణాన ప్రకాశం
ప్రాచీన యుద్ధ కళల్ని కంటికి రెప్పలా కాచుకున్నది దక్షిణ భారతమే. క్రీ.శ. 630ల కాలానికి చెందిన పల్లవ రాజు నరసింహవర్మన్ పదుల కొద్దీ యుద్ధ కళలకు సంబంధించిన గ్రానైట్ శిల్పాలను చెక్కించాడు. వీటిలో సాయుధ సైనికులను నిరాయుధులను చేస్తున్న స్థానిక యుద్ధ కళాకారుల పాటవాన్ని అందులో మలిచారు. చేర, చోళ రాజ్యాల మధ్య చాలా కాలం పాటు సాగిన యుద్ధ వాతావరణం వల్ల యుద్ధ కళలకు అమిత ప్రాధాన్యం లభించింది. విజయనగర రాజ్యస్థాపన తర్వాత వీటికి మరింత ఆదరణ పెరిగింది. ఈ కాలంలో స్త్రీలూ మార్షల్ ఆర్ట్స్‌లో రాణించారు. మల్లయుద్ధం, ముష్టియుద్ధం, ఖడ్గ, ధనుర్విద్యల్లో సత్తా చాటేవారు. యుద్ధ కళల్ని నేర్పే సాముగరిడీలు చాలా చోట్ల ఉండేవి. ఆ కాలంలో రాత్రి భోజనానికి ముందు ఈ గరిడీల్లో సాధన చేసేవారని, ముదుసలి వారూ 30ల వయసున్న వారిలా కనిపించేవారని కొన్ని విదేశీ యాత్రికుల గ్రంథాల్లో రాయబడింది. ఇటలీ యాత్రికుడు పీట్రో డెల్లా వాల్లె దక్షిణాదిలో అదీ తెలుగు జనసామాన్యంలోను విశేషంగా కనిపించే కర్రసాము సాధన గురించి తన యాత్రాపుస్తకంలో వివరించాడు.
ఉత్తరాన వికాసం
ఉత్తర భారత్‌లో 'శస్త్ర విద్య' పేరిట 10 రకాల యుద్ధ కళలుండేవని చరిత్రకారుల చెబుతారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న 'తక్షశిల' ప్రాచీన విశ్వవిద్యాలయ కేంద్రంగా ఈ శాస్త్రవిద్యలు పరిణామం చెందాయని చెబుతారు.ఈ భారతీయ యుద్ధ కళల్ని మొఘలాయిలు స్వీకరించారు. అక్బర్ పాలనలోనే ఔసానస ధనుర్వేద సంకలనం రచించారు. తమ సైన్యానికి రాజ్‌పుత్‌ల యుద్ధ కళల్ని అన్వయింపజేశారు. ఐన్-ఈ-అక్బరీ గ్రంథం దేశం నలుమూలలకు చెందిన యుద్ధ కళా నిపుణులు రాజాస్థానంలో ఉండేవారని చెబుతోంది. ఒంటి చేత్తో శత్రువును మట్టి కరిపించే 'ఏక్ హాత్' అనే కళ గురించి, తూర్పు ప్రాంతాలకు చెందిన 'చిర్వా' అనే చిన్న డాలు గురించి, దక్షిణాది ప్రాంతాల్లో ఉపయోగించే మనిషిని, గుర్రాన్ని కప్పేసే భారీ డాలు 'తిల్వా' గురించి ప్రత్యేకంగా పేర్కొంది. ఛత్రపతి శివాజీ కాలంలో మర్దానీ ఖేలా పునరుజ్జీవనం పొందింది. 'శివ సూత్ర' గ్రంథంలోని గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి ఓ మహా రాజ్య స్థాపన ఈ యుద్ధ కళల ద్వారానే సాధ్యమైంది.
బ్రిటీష్‌పై పోరాడి..
కళింగ రాజ్యానికి వెన్నెముకలా నిలిచిన పైకా యుద్ధ వీరులు అఖాడాల ద్వారా దాని ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. బ్రిటీష్ కాలనీల స్థాపనకు వ్యతిరేకంగా ఒడిషాలో పోరాడిన ఈ అఖాడాలు 1817 మార్చి నెలలో బక్షి జగబంధు బిద్యాధర్ మహాపాత్ర నేతృత్వంలో ఓ భారీ ఉద్యమాన్ని లేవనెత్తింది. సుమారు 400 మంది పైకా యుద్ధకళా వీరులు గంజాంలోని ఘుముసర్ నుంచి ఖోర్దా వరకు మార్చ్ చేశారు. బ్రిటీష్ స్థావరాలపై విరుచుకుపడ్డారు. మిగతా ప్రాంతాల్లోను భారతీయ యుద్ధ కళావీరుల దాడి ఘటనల నేపథ్యంలో సంప్రదాయ యుద్ధ కళలపై బ్రిటీష్‌వారు నిషేధం అమలు చేస్తూ వచ్చారు. 1804లో కలరిపాయెట్టుపై తొలి నిషేధం అమలైంది. ఆ తర్వాత శిలంబం, పైకా అఖాడాలపై కూడా నిషేధం విధించి మిగతా యుద్ధ కళలకూ విస్తరిస్తూ పోయారు. ఇది యుద్ధ కళల సాధనకు పెద్ద ఎదురుదెబ్బలా మారి దాదాపు అదృశ్యమయ్యే స్థితికి వెళ్లిపోయాయి. కొందరు గురువుల ధైర్య సాహసాలు, ఆశయాలు, పట్టుదల, త్యాగాలతో కొన్ని యుద్ధ కళల్ని రహస్యంగా నేర్పిస్తూ వచ్చారు. అలా కలరిపాయెట్టు లాంటి అతి ప్రాచీన కళలు అంతర్థానం కాకుండా మిగిలాయి. 1920లలో తెల్లిచెర్రిలో ఓ ఉద్యమంలా యుద్ధ కళల పునఃశోధన, పునరుత్తేజం సాగింది. దీన్ని స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా చూశారు. స్వాతంత్య్రానంతరం వీటిపై నిషేధం తొలగిపోవడంతో మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ దశ నుంచి బయటపడ్డాయి.
కలరిపాయట్టు
యావత్ ఆసియా యుద్ధ విద్యలలో పాకిపోయిన ఈ దక్షిణాది యుద్ధ కళ తమిళనాడు, కేరళతో పాటు కర్నాటక తులనాడులో కూడా కనిపిస్తుంది. క్రీ.పూ. 2వ శతాబ్దం నాటికే ఉన్నట్టు ఆధారాలున్న ఈ కళ తమిళనాట వందల ఏళ్ల పాటు అభివృద్ధి చెందింది. కేరళలో మరింత అభివృద్ధి చెంది మూడు ప్రధాన శైలులలో ప్రస్తుతం కొనసాగుతోంది. పాడ నాయర్లు, చెకవాల మలబార్ శైలి, నాడర్ల తిరువితన్‌కూర్ దక్షిణ శైలి, మధ్య కేరళ శైలిలో కొన్ని మార్పులుంటాయి. ఉత్తర శైలి కదలికలు, చాకచక్యమైన టెక్నిక్‌లు, ఆయుధాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే, దక్షిణ శైలి బలమైన ప్రభావాన్ని చూపే టెక్నిక్‌లు, వట్టి చేత్తో దాడికి, మర్మ కేంద్రాలపై దృష్టి సారించింది. కలరిపాయట్టును 8 రకాల జంతువులను పోలిన టెక్నిక్‌లతో సాధన చేస్తారు. ఒక్కో పాఠశాల ఒక్కో టెక్నిక్‌కు ప్రాధాన్యతనిస్తుంది. ఒకే శైలిని భిన్న రకాలుగాను ఉపయోగిస్తుంది. కలరి అనే వీటి పాఠశాలల్లో యుద్ధ విద్యతో పాటు ఖగోళ, భూగోళ, సాంఘిక, గణితం వంటి శాస్త్రాల్లోను తర్ఫీదునిచ్చేవారు. రంగస్థల కళలకు కూడా ఇవి నిలయంగా ఉండేవి. ఆయుర్వేదానికి విలక్షణమైన దక్షిణాదికి చెందిన ప్రత్యేక వైద్యశాస్త్రం సిద్ధ వైద్యం ఇక్కడే మొదలైంది.
పైకా అఖాడా
ఒడిషాకు చెందిన ఈ కళ కళింగ రాజ్య స్థాపన నాటికే విస్తృతంగా ఉండేది. రైతు దళంగా ఉన్న ఈ అఖాడాలు స్వతంత్రంగా మనుగడ సాగించేవి. యుద్ధ సమయంలో రాజ్యానికి సేవలను అందించేవి. వ్యాయామ శాలలైన అఖాడాల్లో ఈ కళ తర్వాతి తరాలకు చేరుతూ చాలా కాలం మార్పులు చోటుచేసుకోకుండా మనగలిగింది. ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశమున్న ఈ విద్యను తర్వాత స్త్రీలకు నేర్పించారు. ప్రస్తుతం పైకా నృత్యరూపకంలో ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఖండ, పట్ట వంటి ఖడ్గాలు ప్రత్యేకమైనవి. కళింగ మహోత్సవాల్లో భాగంగా అక్కడి విశ్వశాంతి స్థూపం వద్ద ప్రదర్శిస్తారు.
మల్లయుద్ధం
ఇండో-ఆర్యన్ జాతి చొరబాట్లకు ముందే మల్ల యుద్ధం భారత ఉపఖండంలో ఉంది. క్రీ.పూ. 5000 నాటికే మల్లయుద్ధం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన యుద్ధ కళ. ఆ తర్వాత ఎన్నో మార్పు చేర్పులు చోటుచేసుకుని అనేక రూపాల్లో ఇది తన మూలాల్ని వ్యాపించింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలకు విస్తరించింది. ఇప్పటికీ ప్రాచీన మల్లయుద్ధ శైలి కర్నాటక, తమిళనాడుల్లో కనిపిస్తుంది. మల్ల యుద్ధంలో ప్రధానంగా చోటుచేసుకున్న మార్పు మొఘలుల కాలంలో జరిగింది. మల్లయుద్ధానికి, పర్షియా కోస్తీ పెహల్వానీని జోడించి కుస్తీగా అభివృద్ధి చేశారు. ముక్నా అనే మణిపూర్ రెజ్లింగ్ ఇంఫాల్, తౌబాల్, బిష్ణుపూర్‌లలో బాగా ప్రాచుర్యాన్ని పొందింది. బోలి ఖేలా అనే మరో రెజ్లింగ్ కూడా భారత్‌దే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో బాగా ప్రాచుర్యం ఉంది ఈ కళకు. మిజోరాంకు చెందిన ఇన్‌బువాన్ అనే రెజ్లింగ్ శైలి దుంగ్‌త్లాంగ్ అనే గ్రామంలో 1750ల నుంచి వాడుకలోకి వచ్చింది. బందేశ్ అనే యుద్ధ కళ కూడా కుస్తీని పోలి ఉంటుంది.
ముష్టి యుద్ధం
పిడి గుద్దులతో ప్రత్యర్థిపై విరుచుకుపడే ముష్టి యుద్ధం దక్షిణాసియా బాక్సింగ్‌కు మూలం. ప్రస్తుతం వారణాసిలో మాత్రమే మూకి బాక్సింగ్‌లా మనుగడ సాగిస్తున్న ఈ మార్షల్ ఆర్ట్‌లో ఆయుధాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం పంజాబ్‌లో లోహ ముష్టిగా పిలవబడే బాక్సింగ్‌లో ఒక చేతికి ఉక్కు రింగు తొడికి బాక్సింగ్ సాధన చేస్తారు. అయితే ప్రాణాంతకం కావడంతో స్పారింగ్‌లో ధరించరు. వట్టి చేతులతో రాళ్లను, కొబ్బరికాయల్ని పగులకొట్టే స్థాయి వరకు ఏళ్ల తరబడి చేతులను రాటు దేలుస్తారు. వజ్ర ముష్టిగా పిలిచే మరో ఆయుధ బాక్సింగ్ శైలి కూడా ప్రాచీనమైన భారత యుద్ధ కళే. ఇంద్ర ముక్తిగాను పిలవబడే ఈ కళ ప్రస్తుతం మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు.
శిలంబం
ఆయుధ ప్రధానంగా ఉండే ఈ యుద్ధ కళ తమిళనాట నుంచి వచ్చింది. ప్రస్తుతం మలేషియా, శ్రీలంకలో బాగా ప్రాచుర్యంలో ఉంది. కలరిపాయట్టు, శ్రీలంకలోని అంగమ్‌పోరకు ఇది దగ్గరగా ఉంటుంది. కేరళలోని కురింజి కొండల్లో దొరికే ప్రత్యేకమైన వెదురుతో చేసిన కర్రను ఉపయోగిస్తారు. శిలంబంలోను ప్రధానంగా 18 శైలులున్నాయి. నిల్లైకలాక్కి పాఠశాల శైలి ఎక్కువగా మలేషియాలో కనిపిస్తుంది. 1400 సంవత్సరం నాటికే అక్కడ ఇది వ్యాపించింది. వెదురు కర్రతో పాటు మారు, అరువాల్, పాంతుకోల్, వాల్, కుట్టు కటారు, కత్తి, కటారి, సురుల్ పట్టాయై, ముచాన్ వంటి అనేక రకాల ఆయుధాలను ఉపయోగిస్తారు. ఆయుధం లేకుండా కూడా శిలంబంను సాధన చేస్తారు.
మర్దానీ ఖేల్
మహారాష్ట్రకు చెందిన ఆయుధ ప్రధానమైన ఈ యుద్ధ కళ గెరిల్లా పోరాటాలకు నాంది పలికింది. కొల్హాపూర్‌లో ఎప్పటి నుంచో ఉన్న మర్దానీ ఖేల్‌ను 1600లలో మరాఠా గెరిళ్లా దళాలను నడిపిన షాహాజీ అభివృద్ధి చేశాడు. ఒక్కో దళ సభ్యుడు ఒక్కో ఆయుధంలో నైపుణ్యాన్ని సాధించే ఈ విద్యలో షాహాజీ కుమారుడు ఛత్రపతి శివాజీ 4 అడుగుల భవానీ అనే ఖడ్గ విద్యలో ఆరితేరాడు. అప్పటి నుంచి మరాఠా సైన్యంలో భాగమైన ఈ విద్య ఇప్పటికీ భారత సైనిక రెజిమెంట్‌లోని మరాఠా సైనికులు నేర్చుకుంటారు. కుర్హద్, దండ, ఖుకురీ, ధనుష్య, కట్యారా, బిచువా, బాగ్‌నాక్, పట, తల్వార్, భల, బార్చా, విట, బోతటి, లాఠీ, దళ, మధు వంటి అనేక రకాల కత్తులు, దండాలు, గొడ్డళ్లు తదితర ఆయుధ శ్రేణి ఉంటుంది.
హుయెన్ లాంగ్లాన్
మణిపూర్‌కు చెందిన ఈ మార్షల్ ఆర్ట్‌లో రెండు పద్ధతులుంటాయి. అవి ఆయుధాలను ఉపయోగించే తాంగ్టా, నిరాయుధంగా పోరాడే సారిత్ సరక్. ఖడ్గం, బళ్లెం ప్రధాన ఆయుధాలు. బర్మాకు చెందిన బందో, బంషారులు దీనిని పోలి ఉంటాయి. మణిపూర్ ఉత్సవాలపుడు ఈ కళను ప్రదర్శిస్తారు. థెంగౌ నృత్యంలో దీన్ని విశేషంగా ఉపయోగిస్తారు. మోరురాంగ్, లువాంగ్, మ్యాంగాంగ్, ఖుమాన్, అంగోమ్, ఖాబా-న్గాంబా, సారంగ్ లీషాంగ్తెమ్ అనే ఈ ఏడు వర్గాల గిరిజన తెగలు ఒకే మైతీ సమాజంగా ఏర్పడేందుకు హుయెన్ లాంగ్లాన్ పోటీనే ఆశ్రయించారు. అప్పట్లో గెలిచినవారి తలలను నరికి ట్రోఫీలుగా తీసుకెళ్లేవారు. ఆ తర్వాత దీన్ని నిషేధించారు. ప్రస్తుతం స్త్రీ, పురుషులిద్దరికీ శిక్షణనిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్షల్ ఆర్ట్ మనుగడకు తీవ్రంగా కృషి చేసిన గురుమాయిం గౌరకిషోర్ శర్మను 2009లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.
స్క్యే
కాశ్మీరీల ప్రాచీన యుద్ధ కళ స్క్యే. ఇది కూడా ఇండో-ఆర్యన్ వలసలకు పూర్వమే ఆ ప్రాంతంలో విలసిల్లింది. నాగా జాతి ప్రజలు దీన్ని సృష్టించినట్టు చెబుతారు. కాశ్మీరీ రాజులు ఈ యుద్ధ కళ అభివృద్ధికి విశేష కృషిచేశారు. ఆలోచనకు కూడా అందనంత వేగంగా ఉండే ఖ్వాంకారు అనే కదలికలు ఈ మార్షల్ ఆర్ట్‌లో ఉంటాయి. ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో శిక్షణ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ స్క్యే సమాఖ్య నెలకొల్పి పోటీలను నిర్వహిస్తున్నారు.
గట్కా
ఉత్తర భారత దేశపు ప్రాచీన యుద్ధ కళ ఇది. పంజాబీయులు ఈ కళను ఎక్కువగా సాధన చేస్తారు. వందల ఏళ్లుగా ఉన్న ఈ కళ శాస్త్ర విద్యగా ప్రాచీన భారత్‌లో వెలుగొందింది. ఇప్పుడు ముఖ్యంగా సిక్కు సమాజానికి ప్రధానమైంది. దీన్ని ఒక క్రీడగాను, సంప్రదాయంగాను వినియోగిస్తున్నారు. హోలా మొహల్లా అనే మార్షల్ ఆర్ట్ ఉత్సవంలో ఇదే ప్రధాన యుద్ధ కళ. భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పంజాబ్‌లో ఈ విద్యను ప్రదర్శిస్తారు.
అకీ కిటి
అకీ కిటి అనే కిక్ ఫైటింగ్ నాగాల్యాండ్‌కు చెందింది. డావో అనే వెడల్పాటి ఖడ్గాలతో చేసే యుద్ధ కళలోను ఆరితేరిన నాగాలాండ్ ప్రజల ద్వారా ఈ యుద్ధ కళ బర్మాకు విస్తరించింది. తెగల మధ్య తగాదాలు వచ్చినప్పుడు అకీ కిటి పోటీల ద్వారానే పరిష్కరించుకుంటారు. కేవలం పాదంతోనే ప్రత్యర్థిపై దాడి చేస్తూ, కాళ్లతోనే దాడిని ఎదుర్కునే ప్రత్యేకమైన యుద్ధ కళ ఇది. బినోత్ అనే మధ్య భారతానికి చెందిన ప్రాచీన కళలో సాయుధులను సైతం వట్టి చేతులతోనే మట్టి కరిపించేవారు.
దక్షిణాది యుద్ధ కళలు కేవలం శారీరక దారుఢ్యం, యుద్ధ పోరాటానికే పరిమితం కాకుండా మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఉన్నతి, అంతఃశక్తి ఉద్దీపనకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. సినిమాల ప్రభావం వల్ల కుంగ్‌ఫూ, కరాటేలకు విపరీతమైన ప్రచారం లభించినా విదేశీ ప్రొఫెషనల్ యుద్ధ కళావీరులు సైతం భారత మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేక గౌరవం చాటుతారు. ఇంతటి విశిష్టమైన కళలు నిరాదరణ అనే మరో పెను దెబ్బకు గతంలో కంటే తీవ్రంగా దెబ్బతింటున్నాయి. హాలీవుడ్ మైండ్‌సెట్‌కు అలవాటు పడిన దేశీ యువతకు స్థానిక యుద్ధ కళల పేర్లు కూడా తెలియని పరిస్థితి. కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్ మేనియాల్లోనే కొట్టుకుపోతున్నారు. ఈ పరిస్థితికి ఓ రకంగా ప్రభుత్వాలూ కూడా కారణం. వీటి పరిరక్షణకు బలీయమైన చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడవు. మీడియాలోను అంత ప్రాధాన్యం లభించడంలేదు. కొన్ని కుటుంబాలు, కొన్ని పాఠశాలలు, కొన్ని గ్రామాలు వీటి మనుగడ బాధ్యతల్ని భుజానికెత్తుకుని నడిపిస్తున్నాయి. కానీ, అదీ ఎంతో కాలం సాగదు. వీటి వ్యాప్తి, అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే కేవలం కాగితాల్లోనే వాటి విన్యాసాల్ని చూడాల్సి వస్తుంది. ఈ విద్యలను పాఠశాల విద్యలో భాగం చేస్తే విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. క్రమశిక్షణ, మనో నిగ్రహం, ఆత్మ విశ్వాసం, సామాజిక చైతన్యం వంటి ఉదాత్త భావాలు మొగ్గ దశలోనే అబ్బుతాయి. ఓ పరిపుష్టమైన జాతిగా మారుతుంది. చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాలు ఈ విషయంలో చాలా ముందంజలో ఉన్నాయి. వారి దైనందిన వ్యాయామాలుగాను యుద్ధ కళల్ని మార్చుకుని బలమైన తరాలను తయారుచేసుకుంటున్నాయి. దక్షిణాసియా యుద్ధకళలకు మూలమైన మనం మాత్రం చాలా వెనకబడిపోయాం.
బోధిధర్ముడు
చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేసిన మహా బౌద్ధుల్లో బోధిధర్ముడు ఒకరు. చాన్ బుద్ధిజాన్ని చైనాకు బోధించాడు. బుద్ధుని నుంచి నేరుగా మతాధిపతిగా వచ్చిన 28వ, చివరి మహామునిగా ఆయనకు స్థానం కల్పించారు. క్రీ.శ.5, 6 శతాబ్దాల కాలానికి చెందినవాడిగా చైనా గ్రంథాలు చెబుతున్నాయి. దక్షిణ భారత్‌కు చెందిన ఓ గొప్పరాజుకు మూడో కుమారుడని టాన్లిన్ వేల ఏళ్లనాటి గ్రంథంలో రాసి ఉంది. టిబెట్ గ్రంథాలు నలుపు శరీర ఛాయ కలిగిన ద్రావిడ ముని అని పేర్కొన్నాయి. లంకావతర సూత్రాలను పాటించే ఆయన జెన్ నీతుల్ని ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి, మలేషియాల్లో ప్రవచిస్తూ చివరికి చైనాకు చేరారు. ఆయనకు అతీంద్రియ శక్తులను ఆపాదిస్తూ ఎన్నో ఊహాతీత కల్పనలతో చైనా జానపదాల్లో సాహిత్యం ఉంది. మార్షల్ ఆర్ట్స్‌కు పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్న షావోలిన్ ఆలయంలో ధ్యానమూ, యుద్ధ కళలను అభివృద్ధి చేసింది బోధిధర్ముడేనని చైనా సాహిత్యం పేర్కొంటుంది. 'ఎముక మూలగ, కండర రూపాంతర విద్య' అనే అంతర్గత సాధన, 'పద్దెనిమిది ముని చేతుల' వ్యాయామాలను బౌద్ధమునులకు నేర్పించాడని రచనలు చెబుతు న్నాయి. మలై దేశాలకు సిలాత్ అనే యుద్ధ కళను అందించింది ఆయనేనని మలేషియా సాహిత్యం చెబుతుంది. చైనా, జపాన్, కొరియా, తైవాన్‌లలో ఆయన్ను దైవంగా కొలుస్తారు. యిజిన్ జింగ్, జిస్యు జింగ్ అనే గ్రంథాలను ఆయన రచించారు. యిజిన్ జింగ్ ప్రతుల నకళ్లు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. జిస్యు జింగ్ మాత్రం అదృశ్యమైంది. బోధిధర్ముడే మరికొన్ని ప్రాచీన గ్రంథాలు రచించాడని అంటారు. బోధిధర్ముని మూలాలు దక్షిణ భారత్‌వి కావని ప్రచారం చేసేందుకు పెద్ద ప్రయత్నమే జరిగింది. కానీ, వేయి ఏళ్ల నాటి గ్రంథాలు బోధిధర్ముని ద్రావిడ మూలాల్ని రూఢి చేశాయి.
మర్మ కళ
క్రీ.శ. నాలుగో శతాబ్దికి చెందిన శుశ్రూత సంహిత మానవ శరీరంలో 107 కీలక మర్మ కేంద్రాలుంటాయని వర్ణించింది. ఆ తర్వాత వీటిని 108గా లెక్కించారు. వీటిలో 64 కేంద్రాల్లో పిడిగుద్దుతో గానీ, కర్రతో గానీ సరిగ్గా కొట్టగలిగితే ప్రాణాలు పోగలవని చెబుతూ మర్మ కళకు బీజాలు వేసింది. మర్మ కళపై అనేక వాదోపవాదాలున్నాయి. ఇప్పటికీ కేరళలోని కొన్ని వర్గాలు అతి రహస్యంగా ఈ విద్యను కొనసాగిస్తున్నాయని అంటారు.
తెలుగు వీరులు
ప్రాచీన కాలం నుంచే తెలుగు వారు మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యులు. విజయనగర సామాజ్య్ర కాలంలో తెలుగు నేలలో కొన్ని వేల మంది మల్లయోధులు పోటీల్లో పాల్గొనేవారు. భారత రాబిన్‌హుడ్‌గా పేరొందిన సర్వా పాపడు కూడా తెలుగు యుద్ధ విద్యలను ఉపయోగించే మొఘలులకు చుక్కలు చూపించాడు. ఆంధ్రులకే చెందిన ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ వేల ఏళ్ల నాటి నుంచి ఉన్నాయి. చేడి తాలింఖానా లేదా యుద్ధ కౌశల్య చే తాలిమ్‌గా పిలిచే ఈ యుద్ధ విద్యను తాలింఖానా లేదా తాలిం అని కూడా సంబోధిస్తారు. బాకు సాము, కర్ర సాము, కత్తి సాములు ప్రధానంగా సాధన చేస్తారు. గద, పట వంటి ఆయుధాలను ఉపయోగిస్తారు. ఇప్పటికీ అమలాపురంలో దీని మనుగడ కనిపిస్తుంది. దసరా ఉత్సవాల్లో ఈ యుద్ధ కళను ప్రదర్శిస్తారు. అబ్బిరెడ్డి రాందాస్ 1856లో స్వాతంత్య్ర ఉద్యమ వ్యాప్తికి ఈ కళనే స్ఫూర్తిగా కోనసీమలో ఉపయోగించారు. కోనసీమ పూర్వ వీరులకు రాయల సామ్రాజ్యం నుంచి అందిన జ్ఞాపికను అబ్బిరెడ్డి సేకరించారు. శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆ జ్ఞాపిక ఆయన వంశస్తుల వద్ద ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి